ఒక జీవితం. ఒక ప్రయోజనం..అదీ కధ

ఆ మద్య ఒకతను రోడ్డుపై కనిపించి మా ప్రాంతంలో గ్రోసరీ స్టోర్ ఒకటి పెడుతున్నడని చెబుతూ పేంప్లట్ నా చేతికిచ్చాడు. వెంటనే అతను ఎంతో శ్రమించి ఈ గ్రాసరీ స్టోర్‌లను మొత్తం దేశంలో అన్ని ప్రాంతాల్లో పెట్టేసినట్లు, ఒక బ్రాండ్ నేం సృష్టించినట్లు, తన సక్సస్ స్టోరీని టీవీల్లో చెప్పేస్తున్నట్లు, ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచినట్లు ఒకటే ఆలోచనలు వచ్చేశాయి. ఏమయ్యిందో తెలీదు నాకీ మద్య. ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, వ్యాపారం మొదలుపెడుతున్నారని చెప్పినా ఒకటే ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి.

ఈ మద్యనె “www.ted.com” చూసిన ప్రభావం అనుకుంటా. ఎవరైనా ఏమైనా చెయ్యగలరు. చెయ్యాలనుకోవాలంతే! అని నా మనసులో గాఢంగా ముద్రపడిపోయింది. టెడ్‌లో ఎంతోమంది స్పూర్తిప్రదాతలను కలుసుకునే అవకాశం కలిగింది. స్టీవ్ జాబ్స్, ర్యాండీ పాష్, జే.కే.రౌలింగ్, విలియం కంక్వబ, సునిత క్రిష్ణన్…ఒక్కొక్కరిది ఒక్కో కధ.

స్టీవ్ జాబ్స్ డబ్బులేక కాలేజికి వెళ్ళలేని స్థితినుండి, అంచలంచలుగా ఎదిగి యాపిల్‌లో భాగస్వామ్యం సాధించి, మళ్ళీ అతనికి 30 ఏళ్ళప్పుడు ఆ కంపినీనుండి తప్పుకోవలసిన పరిస్థితికి చేరుకొని, అక్కడ నుండి మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టి ఒక కంపెనీ పెట్టి, దాన్ని యాపిల్‌తో కలిపే స్థాయికి పెంచి, ఊపిరి పీల్చుకుంటుండగా క్యాన్సర్‌కు గురయ్యి, దాని నుండి బయటపడి…అతని జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు?! నేను ఎంతో స్పూర్తి పొందాను అతని మాటలు విని.

ర్యాండీ పాష్ సీ.ఎం.యూలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్. అతనికి “pancreatic cancer”. చనిపోయే ముందు అతను ఇచ్చిన లెక్చరే “last lecture”. “నాకు సంతోషంగా ఉండటం తప్ప ఇంకోలా ఉండటం చేతకాదు” అంటారాయాన. అందుకే చావు కూడా అతని సంతోషాన్ని తీసుకెళ్ళలేకపోయింది. అతని ధైర్యం చూసి ఒళ్ళు గగుర్పొడిచింది నాకు. అతని జీవిత విశేషాలు, అతనికున్న విలువలు, అతని విజయాలు …మొదలైన వాటి గురించి చెప్పారు. అన్నిటికంటే నాకు నచ్చింది “మన జీవితంలో అడ్డుగోడలు మనతో పోటీపడేవాళ్ళలో బలహీనులను ఆపటానికి ఉంటాయి. ఆ విధంగా పోటీని తగ్గిస్తాయి.”అని ఆయన చెప్పిన మాటలు.

కంక్వబ ఆఫ్రికాలో ఒకానొక కరువు పీడిత ప్రాంతాల్లో-ఆకలిని తగ్గించుకోటానికి మొక్కల వేళ్ళ నుండి తీసిన రసం త్రాగేంత కరువు పీడిత ప్రాంతంలో కరువు కారణంగా చదువు మానెయ్యాల్సి వచ్చి, ఖాళీ సమయంలో వచ్చిరాని ఇంగ్లీషుతో ఒక ఫిజిక్స్ పుస్తకం చదివి, ఉన్న అరకొర సామానుతో ఒక విండ్‌మిల్ తయారు చేశారు. ఇదేదో సినిమా కాదు. నిజంగా జరిగింది. మనమే పనైనా చెయ్యాలనుకోవాలే గాని చెయ్యగలం అనటానికి ఇంతకంటే నిదర్శనమేముంది?

పద్నాలుగేళ్ళ వయసులో ఒక గుంపు చేతిలో అత్యాచారానికి గురయ్యి ఈ రోజు అలా బాధింపబడే వేలాదిమందికి అండగా నిలిచిన మహిళ సునీతా క్రిష్ణన్. చాలామందికి ఆ బాధనుండి కోలుకోవటానికి ఒక జీవిత కాలం కూడా సరిపోదు.

ఇలా ఎంతోమందిని ఆ వెబ్సైట్ ద్వారా కలుసుకున్నాను. జీవితాన్ని ప్రయోజనకరంగా ఎలా గడపాలో తెలుస్కున్నాను. అలా గడపటానికి ప్రయత్నిస్తున్నాను. మనవల్ల ఈ ప్రపంచానికీ, మనకీ ఏదో ప్రయోజనమైతే మాత్రం ఉండాలి. ఆ ముక్క అర్ధమయ్యింది.

Posted in Uncategorized | 1 Comment

ఉగ్రవాదానికి మతం లేదన్న విషయాన్ని గ్రహిద్దాం.

ఈ రోజే న్యూయార్క్‌లో మసీదు కట్టడం గురించి నిరసన తెలుపుతూ ఒక బ్లాగులో వ్రాశారు. అప్పుడు నాకీ విషయం చెప్పాలనిపించింది. చాలా రోజుల క్రితం టీవీలో నేనో ప్రోగ్రాం చూశాను. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఘటనలో భర్తలను కోల్పోయిన ఇద్దరు మహిళల గురించి ఆ కార్యక్రమం. వాళ్ళిద్దరూ ఆ రోజు వాళ్ళెలా దిగ్భ్రాంతికి లోనయ్యారో, భర్తతో పాటే జీవితాన్ని ఎలా కోల్పోయారో, ఆ పరిస్థితుల నుండి పిల్లల కోసం ఎలా కోలుకున్నారో అన్నీ వివరంగా చెప్పారు.

కార్యక్రమం చివరలో వాళ్ళేం నిర్ణయం తీసుకున్నదీ చెప్పారు. వాళ్ళు కోలుకున్నాక, వాళ్ళ జీవితం ఒక గాడిలో పడ్డాక వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండే మహిళల అవస్థ చూసే సమయం లభించింది.
వాళ్ళకంటే దురదృష్టవంతులైన ఆ మహిళలకు చేయూత నివ్వాలని నిర్ణయించుకున్నారు. అంతే! ఇద్దరూ వాళ్ళ కోసం డబ్బు సేకరించటం మొదలుపెట్టారు. వాళ్ళకి తమకు చేతనైన సహాయం చేస్తున్నారు.

వాళ్ళు కోల్పోయిన బాధలో కూడా, ఉగ్రవాదాన్ని ఒక మతానికో, ఆ మతం యొక్క మనుషులకో ఆపాదించలేదు. సాటి మనుషులుగా స్పందించారు. తమకంటే దురావస్థలో ఉన్న స్త్రీలను మాతానికీ, ప్రాంతానికీ అతీతంగా ఆదుకుంటున్నారు.

Posted in Uncategorized | 8 Comments

forrest gump movie in one minute

Posted in Uncategorized | Leave a comment

చిరునవ్వు

ఓ రోజు, చాలా బాధతో, అలుపుతో అలా నడుచుకుంటూ వస్తున్నాను. ఒక దగ్గర సిగ్నల్ పడగానే ఆగాను. ప్రక్కకు తిరిగి చూస్తే ఒక చిన్న పాపను వాళ్ళ నాన్నగారు ఎత్తుకున్నారు. సిగ్నల్ పడక ముందు నేను వెనక్కు చూస్తే ఆ పాప నన్ను చూసి ఆశ్చర్యపోవడం చూచాయగా గమనించాను. నేను వాళ్ళ తల్లిదండ్రులంత తెల్లగా లేను కదా. అందుకే అలా చూస్తుందేమోననుకున్నాను. సిగ్నల్ పడినప్పటినుండీ ఒక అడుగు దూరంలో వాళ్ళ పక్కగా నిలబడ్డాను. ఆమె తల్లి ఆమెను ముద్దులాడుతున్నా తల ఇంకొచం పక్కగా పరికించి నన్ను చూస్తుంది. ఆమె తల్లి అది తెలుసుకొని నన్ను చూసి పక్కకు తప్పుకుంది. ఇంక ఆ చిన్నారి నన్ను చూసి నవ్విన చిరునవ్వుని నేనెన్నటికీ మరిచిపోలేను. కేవలం నా బాధ తీర్చటానికే ఆ చిరునవ్వు విసిరిందా అన్న భావన కలిగింది. ఏదో చిన్ని ఏంజల్‌లా భలే అనిపించింది. ఇప్పటికీ ఆ రోడ్లపై నడుస్తున్నప్పుడు ఆ పాప కోసం నా కళ్ళు వెతుకుతూనే ఉంటాయి.

ఒక ఆత్మీయ చిరున్నవ్వు రోజులో ఒక్కరికైనా సాంత్వన కలిగిస్తుందంటే అంతకంటే ఏం కావాలి ఈ జీవితానికి.

Posted in Uncategorized | 1 Comment